వ్యవస్థాగత లోపాలకు నిదర్శనం
పెదపెంకి సీసీ రోడ్లలో నాణ్యతా లోపాలు…
పార్వతీపురం మన్యం జిల్లా పెదపెంకి గ్రామంలో నిర్మించిన సిమెంట్ కాంక్రీట్ (సీసీ) రోడ్లలో నాణ్యతా లోపాలు వెలుగులోకి వచ్చాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ విషయం వచ్చిన వెంటనే రాష్ట్ర స్థాయి చీఫ్ క్వాలిటీ కంట్రోల్ అధికారిని గ్రామానికి పంపి క్షేత్రస్థాయి తనిఖీ చేయించారు.
తనిఖీలో ఐదు సీసీ రోడ్ల నిర్మాణంలో నాణ్యతా లోపాలు ఉన్నట్లు నిర్ధారణైంది. ఈ గ్రామంలో గతంలో ఫైలేరియా (బోద) సమస్య తీవ్రంగా ఉండేది. దీనికి శాశ్వత పరిష్కారం కోసం ఉప ముఖ్యమంత్రి చొరవతో రూ.6.18 కోట్లతో మ్యాజిక్ డ్రైన్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు నిర్మించారు. అయితే ఇప్పుడు నాణ్యతా లోపాలు బయటపడడంతో పవన్ కళ్యాణ్ కఠినంగా స్పందించి, బాధ్యులపై చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించారు.
ముందుగానే క్యాన్సర్‌ను కనిపెట్టే అద్భుత అవకాశం
అమరావతిలో ఇంటిగ్రేటెడ్ ప్రెసిషన్ ఆంకాలజీ… ఆస్ట్రాజెనెకాతో ఏపీ ఒప్పందం
సాధారణ కంప్యూటర్ ఒక పెద్ద లాకర్‌ను ఒక్కో కీతో తెరిచి చూస్తే, క్వాంటం కంప్యూటర్ అన్ని కీలను ఒకేసారి ప్రయత్నించి సరిపోయిన కీని వెంటనే కనుక్కుంటుంది. అదే తరహాలో మందులు, జన్యువుల సమస్యలను కూడా చాలా వేగంగా పరిష్కరించే సామర్థ్యం క్వాంటం సాంకేతికతకు ఉంది. ఫార్మా, బయోటెక్ రంగాల్లో క్వాంటం పరిశోధనలు ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టనున్నారు.
కొత్త మందులు త్వరగా కనిపెట్టడం, వ్యక్తిగత చికిత్సలు అందించడం, క్యాన్సర్ వంటి వ్యాధులను ముందస్తుగా గుర్తించడం వంటి పనులు దీని ద్వారా సాధ్యమవుతాయి. ఇది భవిష్యత్తులో వైద్య రంగాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అమరావతిలో ఇంటిగ్రేటెడ్ ప్రెసిషన్ ఆంకాలజీ విధానాన్ని ప్రారంభించేందుకు అంతర్జాతీయ ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ దిగ్గజం ఆస్ట్రాజెనెకా ఇండియా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. అమరావతిలో ఇంటిగ్రేటెడ్ జెనోమిక్స్ సొల్యూషన్ సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కూడా కుదుర్చుకుంది.
గిరి ప్రదక్షిణ తర్వాతే లక్ష్మీనరసింహుని దర్శనం
సింహాచలంలో రెండు రోజుల పాటు గిరి ప్రదక్షిణ… 5 నుంచి 6 లక్షల మంది భక్తులు
విశాఖపట్నం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో జూలై 28, 29 తేదీల్లో గిరి ప్రదక్షిణ జరుగుతోంది. సుమారు 32 కిలోమీటర్ల మార్గంలో 5 నుంచి 6 లక్షల మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఈ రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆధ్యాత్మిక కార్యక్రమంగా ఇది నిలుస్తోంది. అధికారులు వైద్య శిబిరాలు, తాగునీటి సౌకర్యాలు, లైటింగ్, రెస్ట్ రూములు, పోలీసు భద్రతతో సహా విస్తృత ఏర్పాట్లు చేశారు. గిరి ప్రదక్షిణ పూర్తి చేసిన తర్వాతే భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారు.

