x

ఏపీలో కరువు... అరెస్ట్ ల రాజకీయం... అమరావతి అభివృద్ధి

ఆంధ్ర రాజకీయాలు అరెస్ట్ లకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. వైఎస్సార్సీపీ మాజీ మంత్రులు టార్గెట్ గా ఈ అరెస్ట్ లు జరుగుతున్నాయి.


అరెస్ట్ లతో తడుస్తున్న ఏపీ రాజకీయం...
తొమ్మిది జిల్లాలతో అమరావతి ఆర్థిక ప్రాంతం...
కృష్ణా డెల్టాలో సాగునీటి కరువు....

వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అరెస్ట్‌తో ఉత్తరాంధ్రలో రాజకీయ ఉద్రిక్తత ముదిరింది. తన కుమారుడు ఆరవ్ వర్మ కలిగించిన హిట్ అండ్ రన్ కేసులో సాక్ష్యాలు తారుమారు చేశారన్న ఆరోపణలపై బుధవారం సాయంత్రం కాశీబుగ్గ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ చర్యను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ ప్రతీకారంగా అభివర్ణిస్తూ తీవ్రంగా స్పందించింది.

జూలై 10న కాశీబుగ్గ పాత జాతీయ రహదారిపై ఆరవ్ నడిపిన బైక్ ఢీకొని గొర్రెల కాపరి దానయ్య మరణించిన ఘటనలో అప్పలరాజు కుట్ర పన్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ప్రమాదం తర్వాత కొడుకును తప్పించి, మరో యువకుడిని నిందితుడిగా చూపించడం, మృతుడి కుటుంబంతో రాజీకి ప్రయత్నించడం వంటి అంశాలు దర్యాప్తులో తేలాయని అధికారులు చెబుతున్నారు. దీంతో అప్పలరాజును కేసులో మూడో నిందితుడిగా చేర్చి అరెస్ట్ చేశారు.

మొత్తం కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నారు: జగన్

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు. ఎక్స్‌పై పోస్ట్ చేస్తూ, “రోడ్డు ప్రమాదాన్ని హత్య కేసుగా మార్చి మొత్తం కుటుంబాన్ని రాజకీయంగా హింసిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగం చేస్తోంది. సీదిరి అప్పలరాజు ఒక సాధారణ జాలరి కుటుంబం నుంచి వచ్చి డాక్టర్‌గా, మంత్రిగా ఎదిగిన వ్యక్తి. ఆయనపై తప్పుడు కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారు” అని ఆరోపించారు. టీడీపీ నాయకులు, మంత్రుల కుటుంబాలకు సంబంధించిన ప్రమాదాల్లో ఇలాంటి చర్యలు తీసుకుంటారా అని సవాలు విసిరారు.

టీడీపీ వైపు నుంచి మరో కోణం

మరోవైపు టీడీపీ నేతలు మృతుడి కుటుంబాన్ని కలిసి రూ. 10 లక్షల పరిహారం ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష దానయ్య కుటుంబాన్ని పరామర్శించారు. చట్టం తన పని తాను చేస్తుందని, ఎవరైనా చట్టానికి అతీతులు కాదని స్పష్టం చేశారు. కేసులో ప్రారంభంలో పోలీసులు తప్పుడు వ్యక్తిని నిందితుడిగా చూపించే ప్రయత్నం జరిగిందని, ఆ తర్వాతే సీసీటీవీ ఆధారంగా నిజం బయటపడిందని తెలిపారు.

అరెస్ట్ సమయంలో అప్పలరాజు నివాసం వద్దకు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పలాస-కాశీబుగ్గ ప్రాంతంలో పోలీసు బందోబస్తు పెంచారు. అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్ విధించగా, ఈ కేసు రాజకీయంగా మరింత వేడెక్కే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


తాగునీటికే ప్రాధాన్యం.. ఎప్పుడూ లేని పరిస్థితి

ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో కృష్ణా డెల్టాకు సాగునీరు అందించే అవకాశం ప్రస్తుతం లేదని జలవనరుల శాఖ ఇంజినీర్-ఇన్-చీఫ్ (ఈఎన్‌సీ) కె. నరసింహమూర్తి స్పష్టం చేశారు. తాగునీటి అవసరాలకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని, ఇలాంటి తీవ్ర నీటి కొరత పరిస్థితులు గతంలో ఎప్పుడూ ఎదురుకాలేదని ఆయన అన్నారు.

కృష్ణా డెల్టా నీటి పరిస్థితిపై గురువారం సమావేశం నిర్వహించిన ఈఎన్‌సీ నరసింహమూర్తి మాట్లాడుతూ, ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గడంతో శ్రీశైలం, పులిచింతల వంటి ప్రాజెక్టులకు ప్రవాహాలు బాగా తగ్గాయని తెలిపారు. సాధారణంగా కృష్ణా డెల్టాకు సుమారు 150 టీఎంసీల నీరు అవసరమవుతుందని, వర్షాలు లేనప్పుడు ఇంకా ఎక్కువ అవసరమని వివరించారు. ప్రస్తుతం సాగుకు అవసరమైన నీటి లభ్యత లేదని స్పష్టం చేశారు.

పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు సరఫరా చేస్తున్నప్పటికీ, గోదావరిలోనూ ప్రవాహాలు లక్షల క్యూసెక్కుల నుంచి వేల క్యూసెక్కులకు పడిపోవడంతో పంపింగ్‌పై ప్రభావం పడిందని ఆయన చెప్పారు. పులిచింతలలోని నీటిని కూడా తాగునీటి అవసరాల కోసం భద్రపరిచినట్లు వెల్లడించారు.

వరి సాగు చేయవద్దు.. ఆరుతడి పంటలకు మారండి

రైతులు ప్రస్తుత పరిస్థితుల్లో వరి సాగు చేయవద్దని, నీరు లేక పంట నష్టపోయే ప్రమాదం ఉందని ఈఎన్‌సీ హెచ్చరించారు. బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించారు. అనధికారిక పంపుల ద్వారా నీరు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. 2027 జూన్ వరకు తాగునీటి అవసరాలకు ప్రాధాన్యం ఇస్తూ నీటి నిర్వహణ చేస్తామని, నీటి లభ్యత పెరిగితే వ్యవసాయ శాఖతో సంప్రదించి తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.

గోదావరి డెల్టా పరిస్థితి కొంత ఆశాజనకంగా ఉన్నప్పటికీ, కృష్ణా బేసిన్‌లో నీటి లోటు ఏర్పడిందని ఈఎన్‌సీ స్పష్టం చేశారు. రైతులు విజ్ఞతతో సహకరించాలని కోరారు.


తొమ్మిది జిల్లాలతో ఆర్థిక ప్రాంతం.. అమలు కమిటీ ఏర్పాటు

రాజధాని అమరావతిని కేవలం పరిపాలనా కేంద్రంగా మాత్రమే కాకుండా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఎంజిన్‌గా మార్చేందుకు ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలు వేగం పుంజుకున్నాయి. ‘అమరావతి ఎకనమిక్ రీజియన్’ (AER) పేరుతో తొమ్మిది జిల్లాలను కలుపుతూ భారీ ఆర్థిక మండలిని అభివృద్ధి చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.

ఈ ప్రాంతం నెల్లూరు నుంచి కాకుండా, వెస్ట్ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం జిల్లాలను కలుపుతూ సుమారు 44,962 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించనుంది. రాష్ట్ర జీడీపీలో దాదాపు 35 శాతం వాటా కలిగిన ఈ ప్రాంతాన్ని 2047 నాటికి 250 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రణాళిక నుంచి అమలుకు

ఇటీవల ప్రభుత్వం అమరావతి ఎకనమిక్ రీజియన్ అమలు కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి ఏఈఆర్ సీఈఓ అధ్యక్షత వహిస్తారు. తొమ్మిది జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, యూడీఏ కమిషనర్లు సభ్యులుగా ఉంటారు. సీఆర్డీఏ కమిషనర్ సభ్య కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ప్రణాళిక దశ నుంచి అమలు దశకు మారేందుకు ఇది కీలక అడుగని అధికారులు చెబుతున్నారు.

అమరావతిని యాంకర్ సిటీగా, విజయవాడ-గుంటూరులను పారిశ్రామిక, సేవా కేంద్రాలుగా, ఏలూరు-బాపట్లను వ్యవసాయ-పారిశ్రామిక హబ్‌లుగా, ఒంగోలు-మార్కాపురాన్ని ఖనిజ, తయారీ కారిడార్‌లుగా అభివృద్ధి చేయాలని ప్రణాళిక. పోర్ట్ ఆధారిత పరిశ్రమలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎలక్ట్రానిక్స్, డ్రోన్‌లు, సెమీకండక్టర్, ఈవీ కాంపోనెంట్స్, ఫార్మా, టెక్స్‌టైల్స్, డిఫెన్స్ వంటి రంగాలపై దృష్టి సారించనున్నారు.

సింగపూర్, ఎడీబీ సహకారం

ఈ ప్రణాళికకు ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) ఆర్థిక, సాంకేతిక సహకారం అందిస్తోంది. సింగపూర్ నమూనాను అనుసరిస్తూ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నారు. స్వర్ణాంధ్ర విజన్-2047, నీతి ఆయోగ్ సూచించిన సిటీ ఎకనమిక్ రీజియన్ ఫ్రేమ్‌వర్క్‌తో ఈ ప్రణాళికను అనుసంధానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిని పెట్టుబడులు, ఆర్థిక కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా మార్చాలని అధికారులను ఆదేశించారు.

ప్రస్తుతం రాజధాని నగర నిర్మాణ పనులు కొనసాగుతుండగా, ఎకనమిక్ రీజియన్ ద్వారా ఉపాధి, పెట్టుబడులు పెంచి రాష్ట్రాన్ని ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మార్చే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

Read More
Next Story