బీసీ బిల్లు, ఆర్టీసీ ఆందోళన, ఒంగోలు కూటమి పోరు
బీసీ రిజర్వేషన్ బిల్లుకు తుది మెరుగులు.. ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళన, ఒంగోలులో కూటమి నేతల మాటల యుద్ధం.
బీసీ కులాలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించే బిల్లుకు ప్రభుత్వం తుది మెరుగులు దిద్దుతోంది. ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనుంది. ఈ నెల 14న ఏకసభ్య బీసీ కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ఈ రిపోర్టును మంత్రివర్గ ఉపసంఘం పరిశీలించి సిఫార్సులు చేస్తుంది. అనంతరం మంత్రిమండలి ఆమోదించి అసెంబ్లీకి పంపిస్తారు. అసెంబ్లీ ఆమోదం అనంతరం కేంద్ర ప్రభుత్వ ఆమోదం తీసుకుని చట్టాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఇదే సమయంలో విద్యుత్ బస్సుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆర్టీసీ ఉద్యోగులు కొనసాగిస్తున్న ఉద్యమానికి ప్రభుత్వ, ప్రజా సంఘాల మద్దతు లభిస్తోంది. ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షులు విద్యాసాగర్ ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. ఇటీవల ఆర్టీసీ ఎండితో చర్చలు జరిపినా ఫలితం రాలేదు. దీంతో ఉద్యోగులు మళ్లీ ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఈ నెల 17, 18 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా 129 డిపోల్లో రెండు రోజుల సామూహిక నిరాహార దీక్షలు, 29న అన్ని జిల్లాల ప్రజా రవాణా అధికారుల కార్యాలయాల దగ్గర మహాధర్నాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలకు ప్రజా సంఘాలు మద్దతు ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు.
మరోవైపు ఒంగోలులో కూటమి పార్టీల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య రెండు రోజులుగా మాటల యుద్ధం జరుగుతోంది. దీంతో రెండు పార్టీల హైకమాండ్లు సీరియస్ అయ్యాయి. కూటమికి నష్టం కలిగించేలా వ్యవహరించవద్దని టీడీపీ, జనసేన అధిష్ఠానాలు ఆదేశాలు జారీ చేశాయి. ఇద్దరు నేతల పరస్పర ఆరోపణల నేపథ్యంలో కూటమి పక్షాల సమన్వయ కమిటీ సభ్యులు సోమవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టీడీపీ తరఫున రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మంత్రి నిమ్మల రామానాయుడు, జనసేన నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ హరిప్రసాద్ పాల్గొన్నారు. ఆరోపణలుంటే పార్టీల అధినాయకత్వం దృష్టికి తీసుకురావాలని కమిటీ ఇద్దరు నేతలనూ కోరింది. దామచర్ల జనార్దన్‌కు మంత్రి అచ్చెన్నాయుడు ఫోన్ చేసి సూచనలు చేయగా, బాలినేని శ్రీనివాసరెడ్డికి కూడా జనసేన అగ్రనేతలు ఫోన్ చేశారు.

